అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం అత్యంత నిపుణులైన విదేశీ కార్మికుల కోసం హెచ్-1బీ వీసా రుసుమును $100,000 కంటే ఎక్కువగా పెంచాలని , ఈ ఛార్జీలను శాశ్వతం చేయాలని ప్రతిపాదించింది. అమెరికన్ ఉద్యోగాలను విదేశీ కార్మికులు పొందకుండా నిరోధించే మార్గంగా ఫీజును ప్రకటించారు. యూఎస్ కోర్టులు ఈ పెరిగిన ఫీజు చట్టబద్ధమైనదా కాదా అనే అంశంపై విచారణ జరుపుతున్నప్పటికీ, భారతీయులతో సహా అంతర్జాతీయ సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపే ఈ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ చర్య మరింత తీవ్రమవుతోంది.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించిన ఈ ఫీజును, ట్రంప్ యంత్రాగం గత ఏడాది మొదటిసారిగా తాత్కాలికంగా విధించింది. ఇది టెక్నాలజీ, విద్య , పరిశోధన రంగాలపై భారీగా ఆధారపడే వీసాల ధరలను పెంచింది. ఈ తాత్కాలిక ఫీజు పెంపు సెప్టెంబర్‌లో ముగియనుంది.
$100,000 ఫీజుపై కోర్టు సవాలు:
కొత్త హెచ్-1బీ వీసాలపై ట్రంప్ యంత్రాంగం విధించిన $100,000 ఫీజును బోస్టన్లోని ఫెడరల్ జడ్జి కొట్టివేయడంతో ఈ ప్రతిపాదిత పెంపు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఆమోదించని చట్టవిరుద్ధమైన పన్నుగా ఇది ఏర్పడిందని తీర్పు చెప్పారు. అయితే, ఈ వివాదాన్ని అప్పీల్ కోర్టు సమీక్షిస్తోంది.
శాశ్వత ఫీజు కోసం ట్రంప్ యంత్రాగం యోచన..
సోమవారం ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేసిన తాజా నిబంధనలో పెరిగిన ఫీజును శాశ్వతం చేయాలని ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించింది. కొత్త నిబంధన ప్రకారం హెచ్-1బీ వీసా ఫీజును $103,265కి శాశ్వతం చేయనున్నారు. ఇది ఈ ఏడాది చివరి నాటికి ఖరారు కావచ్చని తెలుస్తోంది.
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అంటే?
ప్రత్యేక రంగాలలో శిక్షణ పొందిన విదేశీ కార్మికులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా కార్యక్రమం యూఎస్ యజమానులను అనుమతిస్తుంది. ఇది ఏటా 65,000 వీసాలను, అధునాతన డిగ్రీలు ఉన్న కార్మికుల కోసం మరో 20,000 వీసాలను అందిస్తుంది. ఈ వీసా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఆమోదించబడుతుంది. ట్రంప్ యంత్రాంగం ఈ కార్యక్రమం కోసం పెరిగిన ఖర్చును విధించడానికి ముందు, సాధారణ ఫీజులు $2,000 నుండి $5,000 వరకు ఉండేవి.
ఈ ఫీజు నుంచి మినహాయింపు ఎవరికి లభిస్తుంది?
అయితే, ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్లో స్టూడెంట్ వీసాలపై ఉన్న విదేశీ పౌరులకు మంజూరైన వీసాలకు (వీరు కొత్త హెచ్-1బీ గ్రహీతలలో ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు) లేదా ప్రస్తుత వీసాల పునరుద్ధరణలకు ఈ ఫీజు వర్తించదు. కోర్టు ఫైలింగ్‌ల ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లోని దాదాపు 70 మంది యజమానులు ఫిబ్రవరి నాటికి మొత్తం 85 వీసా దరఖాస్తులపై $100,000 ఫీజును చెల్లించారు.
