అమెరికా గడ్డపై జన్మించే వారికి పుట్టుకతోనే సిటిజెన్షిప్ దక్కే హక్కును నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన విధానానికి న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వం పొందడానికే ప్రసవ సమయానికి విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ‘బర్త్ టూరిజం’ విధానాన్ని అడ్డుకోవాలని ట్రంప్ భావిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై మేరీల్యాండ్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా ఎల్ బోర్డ్‌మాన్ బుధవారం ఇంజెక్షన్ ఆర్డర్ జారీ చేశారు. వలస వచ్చిన కుటుంబాలు , వివిధ సంఘాలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై తుది తీర్పు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
గతంలో ట్రంప్ చేసిన ఇలాంటి ప్రయత్నాన్ని జూన్‌లో సుప్రీంకోర్టు కొట్టివేయగా, ఆగస్టులో కొన్ని మార్పులతో ఆయన మరోసారి ఆ ఉత్తర్వులను అమలయ్యేలా చూసే ప్రయత్నం చేశారు. అయితే ఈ కొత్త ఉత్తర్వుల అమలును ఆపవద్దని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జడ్జి బోర్డ్‌మాన్ తోసిపుచ్చారు. ఈ పరిణామంపై శ్వేతసౌధం నుంచి స్పందన రావాల్సి ఉంది.
