కాలిఫోర్నియా (అమెరికా) కేంద్రంగా పనిచేస్తున్న డీప్‌టెక్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ సంస్థ ‘క్లౌడ్ యాంగిల్స్’ హైదరాబాద్‌లో తమ ‘గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్’ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ‘కో-బిల్డ్’ విధానంలో ఈ కేంద్రం కీలకముగా వ్యవహరించనుంది. హైదరాబాద్‌లో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లౌడ్ యాంగిల్స్ సీఈఓ ఎన్. రేవతిపతి, ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
కొత్త కేంద్రంలో డిజిటల్ టెక్నాలజీ, అప్లికేషన్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్, డిజిటల్ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కార్పొరేట్ సిస్టమ్స్ తదితర విభాగాలలో సేవలు అందించనున్నారు. రానున్న రెండేళ్లలో ఈ కేంద్రంలో 1,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రపంచస్థాయి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలిచిందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన 470కి పైగా జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
