అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలతో కలకలం రేపారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్ముూజ్ జలసంధి అమెరికా భూభాగం కిందకు వస్తుందంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక మ్యాప్‌ను పోస్ట్ చేయడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇరాన్‌తో ప్రస్తుతానికి ఎలాంటి చర్చలు జరిపే ప్రణాళిక తమ వద్ద లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో దాడులు జరిగినప్పటికీ అక్కడ రాకపోకలు పరిమిత స్థాయిలో సాగుతున్నాయని, ఆ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉందని ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో తమ దిగ్బంధాన్ని మరింత ప్రభావవంతంగా కొనసాగిస్తున్నామని, సముద్ర జలాల్లోని మందుపాతరలన్నింటినీ తొలగించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. అయితే, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇరాన్ విదేశీరంగ శాఖ ఉపమంత్రి కాజీమ్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం అమెరికా భ్రమేనని కొట్టిపారేశారు. ఇరాన్ డిమాండ్లను అంగీకరించే వరకు హోర్ముజ్ మూసివేత కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, హర్మూజ్ జలసంధిలో నౌకలపై సంయుక్త నియంత్రణ కోసం ఇరాన్‌తో ఒప్పందానికి ప్రయత్నిస్తున్న ఒమన్ దేశాన్ని కూడా ట్రంప్ హెచ్చరించినట్లు సమాచారం. ఒమన్ వ్యవహారశైలిపై తాను అసంతృప్తిగా ఉన్నానని, ఆ దేశంపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. ఇరాన్‌తో చర్చల్లో ఒమన్ దృఢంగా వ్యవహరించలేకపోతోందని అమెరికా భావిస్తోంది. మరో పరిణామాన్ని పరిశీలిస్తే.. సౌదీ అరేబియాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
