అమెరికాలో నిపుణుల కొరతను తక్కువ సమయంలో తీర్చడానికి హెచ్-1బీ వీసా విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ వీసా రుసుమును 1,03,265 డాలర్లకు పెంచడం సరైన పద్ధతి కాదని ఐటీ పరిశ్రమ సంఘం ‘నానాస్కామ్’ మంగళవారం స్పష్టం చేసింది. హెచ్-1బీ వీసాలపై భారత టెక్ కంపెనీల ఆధారపడే ధోరణి ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయిందని నాస్కామ్ వెల్లడించింది. గడచిన ఐదేళ్ల కాలంలో అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ టెక్ సంస్థలు అక్కడి స్థానికులనే ఉద్యోగాల్లో నియమించుకోవడాన్ని క్రమంగా పెంచినట్లు తెలిపింది.
విద్యాభివృద్ధికి భారీ పెట్టుబడులు..
అమెరికాలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) విద్యాభివృద్ధి కోసం భారత టెక్ రంగం 1.1 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.10,000 కోట్లు) పైగా పెట్టుబడులు పెట్టింది. అంతేకాకుండా 130కి పైగా విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుని, 29 లక్షల మంది విద్యార్థులకు, 2.55 లక్షల మందికి పైగా ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించినట్లు నాస్కామ్ పేర్కొంది.
ప్రస్తుత వీసా నిబంధనలు..
ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ నిబంధనల ప్రకారం సాధారణ క్యాప్ కింద ఏడాదికి 65,000 హెచ్-1బీ వీసాలు కేటాయిస్తున్నారు. అలాగే అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన విదేశీ నిపుణుల కోసం అదనంగా 20,000 హెచ్-1బీ వీసాలను (మాస్టర్స్ క్యాప్) అందిస్తున్నారు.
కొత్త ప్రతిపాదనపై స్పందన..
విదేశాల నుంచి కొత్తగా అందే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల రుసుం వసూలు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. ఆ కోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కూడా నిరాకరించింది. ఆ తర్వాతి నెలలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. రాబోయే 30 రోజుల్లోగా ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను ఆ శాఖ ప్రత్యేకంగా ఆహ్వానించింది.
