అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని బ్రెవార్డ్ కౌంటీలో ఉన్న ఇంటర్‌స్టేట్-95 (I-95) మార్గంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పామ్ బే ప్రాంతంలోని 172వ మైలురాయి వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును వేగంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
నిజామాబాద్ యువకుడి మృతి..
మృతి చెందిన వారిలో ఒకరు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నారాయణపూర్ (నాడాపూర్)కు చెందిన రాహుల్‌గా కుటుంబ సభ్యులు గుర్తించారు. హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడైన రాహుల్.. ఉన్నత చదువుల నిమిత్తం కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసుకుని భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న యువకుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో నారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారేనని సమాచారం ఉన్నప్పటికీ, వారి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. మృతదేహాల తరలింపునకు సంబంధించిన వివరాల కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
