టాలీవుడ్లో దేవరకొండ కుటుంబం నుంచి వరుసగా మూడు నెలల్లో మూడు భారీ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ నటించిన ‘ఎపిక్’ విడుదలవుతుండగా, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబలి’, నవంబర్ 27న రష్మిక మందన్న ‘మైసా’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ వరుస రిలీజ్‌ల ద్వారా బాక్సాఫీస్ వద్ద భారీ బజ్ క్రియేట్ అవుతున్నప్పటికీ, ఈ ముగ్గురి గత సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌లపై అంచనాలు మరింత పెరిగాయి.
ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ ప్రత్యేకతలు..
ఆనంద్‌కు ‘బేబీ’ సినిమా ఘన విజయాన్ని అందించినా, ఆ తర్వాత వచ్చిన ‘గం గం గణేశా’ ఆ ఊపును కొనసాగించలేకపోయింది. ఇప్పుడు ‘ఎపిక్’ చిత్రంలో మళ్లీ వైష్ణవి చైతన్యతో కలిసి నటిస్తున్నాడు. ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ కథను తెరకెక్కిస్తుండటంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అయితే ఆనంద్‌కు ఈసారైనా బలమైన థియేట్రికల్ హిట్ పడాల్సి ఉంది.
‘రణబలి’పై భారీ అంచనాలు..
విజయ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆయన గత చిత్రం మంచి ఓపెనింగ్లను రాబట్టినప్పటికీ, చివరకు పెద్దగా క్లిక్ కాలేదు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ కథాంశంతో భారీ కాన్వాస్‌పై ‘రణబలి’ చేస్తున్నాడు. రష్మికతో మరోసారి జోడీ కడుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘లైగర్’ తర్వాత సరైన హిట్ కోరుకుంటున్న విజయ్‌కు ఈ చిత్రానికి ఓపెనింగ్స్‌తో పాటు బలమైన థియేట్రికల్ రన్ కూడా చాలా అవసరం.
రష్మిక ‘మైసా’ ప్రత్యేకత..
స్టార్ హీరోయిన్గా పలు విజయాలు అందుకున్న రష్మిక నటించిన ఇటీవల చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ‘మైసా’లో మాత్రం కథ పూర్తిగా ఆమె చుట్టూనే తిరగనుంది. ట్రైబల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ యాక్షన్ చిత్రంలో రష్మిక సోలోగా తన క్రేజ్‌తో ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాల్సి ఉంది. ఈ సినిమాతో ఆమె సోలో థియేట్రికల్ మార్కెట్ ఏంటో తేలనుంది.
విభిన్న జానర్లు..
ఈ మూడు సినిమాలు పూర్తిగా భిన్నమైన జానర్లలో వస్తున్నాయి. ‘ఎపిక్’ యూత్ లవ్ స్టోరీ కాగా, ‘రణబలి’ పీరియడ్ యాక్షన్ డ్రామా, ‘మైసా’ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ కథ. ఇక ‘ఎపిక్’ విడుదలైన 35 రోజులకు ‘రణబలి’, ఆ తర్వాత 42 రోజులకు ‘మైసా’ వస్తుండటంతో సెప్టెంబర్ మధ్య నుంచి నవంబర్ చివరి వరకు బాక్సాఫీస్ వద్ద దేవరకొండ ఫ్యామిలీ హవా కొనసాగనుంది. ఏదేమైనా తుది ఫలితం కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది.
