పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఏడు అరబ్ దేశాల అత్యున్నత స్థాయి సైనికాధికారులు జర్మనీలో రహస్యంగా సమావేశమయ్యారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఈ భేటీని ఏర్పాటు చేయగా, ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్ దేశాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఇరాన్‌తో యుద్ధం, ప్రాంతీయ భద్రత, హూతీల దాడులు, హర్మూజ్ జలసంధి పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు ‘ఆక్సియోస్’ నివేదించింది. ఈ భేటీని ముందుగా ప్రకటించనప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే నిర్వహించినట్లు సెంట్కామ్ ధ్రువీకరించింది.
అమెరికా బలగాల ఉపసంహరణ ఉండదు..
ఇరాన్ నుంచి అమెరికా సైనిక స్థావరాలపై దాడులు జరుగుతున్నప్పటికీ, పశ్చిమాసియా నుంచి తమ బలగాలను వెనక్కి రప్పించే ప్రణాళిక లేదని బ్రాడ్ కూపర్ ఈ సమావేశంలో స్పష్టం చేసినట్లు ఆక్సియోస్ తెలిపింది. హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను మరింత సులభతరం చేసే వ్యూహాలను ఆయన వివరించారు. ఇదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనిక చర్యల తీరును ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఎయాల్ జమీర్ వివరించినట్లు సమాచారం.
ఇజ్రాయెల్‌కు రూ.26 వేల కోట్ల ఆయుధ ప్యాకేజీ..
మరోవైపు ఇజ్రాయెల్‌కు సుమారు రూ.26 వేల కోట్ల (2.8 బిలియన్ డాలర్లు) భారీ ఆయుధ ప్యాకేజీకి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ఒక్కొక్కటి టన్ను బరువుండే 40 వేల బాంబులు (20 వేల ఎంకే-84, 20 వేల బీఎల్‌యూ-117) ఉండగా, వాటితో పాటు 20 వేల ఐ-2000 పెనెట్రేటర్ వార్‌హెడ్స్ కూడా ఉన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా ఆయుధాగారంలో అత్యంత విధ్వంసకరమైనవిగా భావించే ఎంకే-84 బాంబులను ఇజ్రాయెల్ గతంలో లెబనాన్, గాజాలో వాడటంతో అప్పట్లో బైడెన్ ప్రభుత్వం వీటి డెలివరీని నిలిపివేసింది. అయితే, తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ నిలుపుదలను ఎత్తివేయడం గమనార్హం.
