పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్‌కు సుమారు రూ. 26 వేల కోట్ల (2.8 బిలియన్ డాలర్లు) విలువైన భారీ ఆయుధ ప్యాకేజీని అమెరికా ఆమోదించింది. ఈ డీల్‌లో ఒక్కొక్కటి టన్ను బరువుండే దాదాపు 40 వేల శక్తివంతమైన బాంబులు ఉన్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వీటిలో 20 వేల ఎంకే-84 (MK-84) బాంబులు, 20 వేల బీఎల్‌యూ-117 (BLU-117) రకం బాంబులతో పాటు నేల, కాంక్రీట్, రాళ్లను సులభంగా ఛేదించి లోపలికి వెళ్లగల 20 వేల ఐ-2000 పెనెట్రేటర్ వార్‌హెడ్స్ కూడా ఉన్నాయి.
విధ్వంసకర ఆయుధాలపై ఆందోళనలు..
అమెరికా ఆయుధాగారంలో అత్యంత ప్రమాదకరమైనవిగా భావించే ఎంకే-84 బాంబులు పేలితే పెద్ద ఎత్తున లోహపు శకలాలు వేలాది అడుగుల దూరం దూసుకెళ్తాయి. గతంలో లెబనాన్, గాజాపై ఇజ్రాయెల్ ఈ బాంబులను వాడటంతో అప్పట్లో బైడెన్ సర్కార్ వీటి డెలివరీని నిలిపివేసింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆంక్షలను ఎత్తివేశారు. జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ తరహా భారీ బాంబులను ఉపయోగించడం వల్ల సామాన్య పౌరులకు తీవ్ర ప్రాణనష్టం జరుగుతుందని మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
నిధుల సమకూర్పు విధానం..
ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ ఆయుధ ఒప్పందానికి సంబంధించి యూఎస్ కాంగ్రెస్‌కు ట్రంప్ యంత్రాంగం అనధికారికంగా సమాచారం అందించినట్లు సమాచారం. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్ (FMF) ద్వారా ఇజ్రాయెల్‌కు కేటాయిస్తారు. ఈ నిధులతోనే ఇజ్రాయెల్ ఈ ఆయుధాలను కొనుగోలు చేయనుంది.
