అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల్లో తన పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధాన్ని సాగదీస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో నవంబర్‌లో జరగనున్న కీలకమైన మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు వేగంగా తగ్గుముఖం పడతాయని తెలిపారు. మరోవైపు, ఈ యుద్ధాన్ని ట్రంప్ సమర్ధిస్తున్నారని పేర్కొన్నారు. 9/11 నాటి ఆల్‌ఖైదాతో ప్రారంభమైన ఉగ్రవాద పోరాటం, నేడు దానికి మద్దతు ఇస్తున్న నంబర్ వన్ దేశంగా ఉన్న ఇరాన్‌పై కొనసాగుతోందని, ఇరాన్‌కు అణ్వాయుధం దక్కకుండా తమ సైనికులు శ్రమిస్తున్నారని వెల్లడించారు.
అమెరికా 9/11 ఉగ్రదాడులను వాడుకుంటోందని..
అమెరికా వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌పై సైనిక చర్యలను సమర్థించుకునేందుకు అమెరికా 9/11 ఉగ్రదాడులను వాడుకుంటోందని విమర్శించింది. 9/11 దాడుల వెనుక ఇరాన్ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. నాటి దాడులకు పాల్పడిన ఆల్‌ఖైదా ఉగ్రవాదులను అమెరికానే స్వయంగా ఆయుధాలు, వ్యవస్థాపక సహకారంతో పెంచిపోషించిందని ఇరాన్ మండిపడింది.
