అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో భారత సంతతికి చెందిన శాలిని రాకూర్ (38) అనే మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను ఏడాది కాలంగా వెంటబడి వేధిస్తున్న రోహిత్ అనే యువకుడు ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతను తన్ను తాను తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.
వేధింపులు..
అక్రమంగా దేశంలోకి ప్రవేశించాడనే ఆరోపణలపై రోహిత్ (22)ను అరిజోనా పోలీసులు 2023లో నిర్బంధించగా, ఆ తర్వాత కొన్ని రోజులకు అతను జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో శాలినితో పరిచయం ఏర్పరచుకున్న రోహిత్.. ఆమె వెంటపడి పెళ్లి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి చేసేవాడు. ఇంటి ముందు గంటల తరబడి వేచి ఉండటం, కారు టైర్లలో గాలి తీసేయడంతోపాటు ఆమె కదలికలను తెలుసుకునేందుకు కారులో ట్రాకర్‌ను పెట్టేవాడు. ఒకరోజు రాత్రి ఆమె ఇంట్లోకి కూడా చొరబడటంతో శాలిని తీవ్ర భయాందోళనకు గురై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
కోర్టు ఆదేశాల బేఖాతరు..
శాలిని జోలికి వెళ్లొద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రోహిత్ వాటిని లెక్కచేయకుండా ఆమెను వేధించడం కొనసాగించాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీన శాలినిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి హత్య చేసాడు.
