అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విలేకరులు శ్వేతసౌధంలోకి ప్రవేశించకుండా నిషేధాజ్ఞలు విధించడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ వార్తాసంస్థలు సీఎన్ఎన్ (CNN), ఎంఎస్ నౌ (MS Now), పొలిటికో (Politico) సోమవారం అధికారికంగా కోర్టును ఆశ్రయించాయి. ఎంపిక చేసిన కొన్ని మీడియా సంస్థలను మాత్రమే ఇలా లక్ష్యంగా చేసుకుని నిషేధించడం అమెరికా రాజ్యాంగంలోని మొదటి సవరణ (First Amendment) కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఆ వార్తాసంస్థలు తమ దావాలో పేర్కొన్నాయి. వార్తాసంస్థలు ఎలాంటి వార్తలు ప్రచురించాలో లేదా ప్రసారం చేయాలో ప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ ఎలాంటి నియంత్రణ అధికారమూ లేదని స్పష్టం చేశాయి.
ట్రంప్ ఆరోపణలు..
ఈ మూడు మీడియా సంస్థలు తమ ప్రసారాల్లో నిరంతరం తప్పుడు వార్తలను (ఫేక్ న్యూస్) ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, వాటికి చెందిన విలేకరులు శ్వేతసౌధంలోకి రాకుండా ట్రంప్ శనివారం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే తాము ట్రంప్ సర్కార్‌పై న్యాయపోరాటం చేయనున్నట్లు ఆ సంస్థలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి. ప్రభుత్వ తీరును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన ఈ పరిణామం అమెరికాలో రాజకీయంగా, మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
