భారత్ నుంచి ప్రారంభమై పశ్చిమాసియా మీదుగా ఐరోపాకు చేరుకునే ప్రతిష్టాత్మక ‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్’ (IMEC) ప్రాజెక్టుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాల ప్రతినిధులతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జలమార్గాలు , ప్రాంతాలకు దూరంగా ఇంధన మౌలిక వసతులు, రవాణా మార్గాలు ఉండాలని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం..
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. పొరుగు దేశాల నౌకలపై ఇరాన్ నిరంతరం ఉగ్రదాడులకు పాల్పడుతోందని విమర్శించారు. పశ్చిమాసియాలో ఇంధన సరఫరా వ్యవస్థల్లో పెను మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇరాన్ పట్టు ఉన్న ప్రాంతాలకు దూరంగా, పైపులైన్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని వేధిస్తున్న సమస్యలకు చెక్ పెట్టేందుకే తమ ప్రభుత్వం ‘ఐమెక్’ ప్రాజెక్టుకు పూర్తి మద్దతు ఇస్తోందని వెల్లడించారు.
ఏమి ఈ ‘ఐమెక్ కారిడార్’?
దక్షిణాసియా, పశ్చిమాసియా , ఐరోపా దేశాలను అనుసంధానించే ఒక బహుళ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్టే ఈ ఐమెక్ (IMEC). భారత్‌లో మొదలై వివిధ దేశాల మీదుగా ఐరోపాలో ముగిసే ఈ కారిడార్‌ను 2023 సెప్టెంబర్‌లో దిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సులో తొలిసారిగా అధికారికంగా ఆవిష్కరించారు. అంతర్జాతీయ వాణిజ్యం , ఇంధన రవాణాను మరింత సులభతరం చేయడంలో ఈ ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది.
