అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధాన్ని ఒక అత్యాధునిక మిలిటరీ కాంప్లెక్స్‌గా మార్చేందుకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఇందులో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న బాల్‌రూమ్‌పై ఒక అత్యాధునిక డ్రోన్పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. క్షిపణులను ప్రయోగించగల శక్తి ఉన్న డ్రోన్లు కూడా ఇందులో ఉండనున్నాయని ఆయన వెల్లడించారు. వాషింగ్టన్లో దాదాపు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్వేతసౌధాన్ని శత్రువుల నుంచి రక్షించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
నిపుణుల అనుమానాలు..
శ్వేతసౌధానికి సమీపంలోని ట్రెజరీ డిపార్ట్మెంట్ భవనంపై సీక్రెట్ సర్వీస్ విభాగం ఇప్పటికే రహస్యంగా ఒక మినీ డ్రోన్పోర్టును నిర్వహిస్తోంది. దీని ద్వారా గాల్లోకి డ్రోన్లను పంపి సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రతిపాదిస్తున్న భారీ డ్రోన్పోర్టుపై నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రోన్ నేరుగా శ్వేతసౌధం దాకా వస్తే అది భద్రతా వైఫల్యమే అవుతుందని స్కైఫైర్ఏఐ వ్యవస్థాపకుడు మ్యాట్ స్లోనే అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉన్న మినీ డ్రోన్లే సరిపోతాయని ఆయన పేర్కొన్నారు. 2024లో పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన దాడి సమయంలో నిందితుడు డ్రోన్‌ను ఉపయోగించిన నేపథ్యంలో, అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల విధ్వంసాన్ని చూశాక వైట్‌హౌస్‌లో ఈ రక్షణ అవసరమైందని భావిస్తున్నారు.
గగనతల రద్దీ సమస్య
ట్రంప్ కోరినట్లుగా శ్వేతసౌధం బాల్రూమ్ వద్ద భారీ డ్రోన్పోర్టును ఏర్పాటు చేస్తే పౌర విమానాలకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీనికి అతి సమీపంలోనే అత్యంత రద్దీగా ఉండే రీగన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్టు ఉండటంతో పాటు కమర్షియల్ విమానాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుతో సమన్వయం చేసుకుంటూ డ్రోన్పోర్టును నిర్వహించడం కత్తిమీద సాములా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
