అమెరికా ఉగ్రచర్యల కారణంగా తమ దేశ ప్రజలు బాధితులుగా మారారని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న ఐరాస 81వ సర్వ ప్రతినిధి సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అగ్రరాజ్యం తమపై దాడులకు పాల్పడిందని, అయినప్పటికీ తాము ఎక్కడా తలొగ్గలేదని స్పష్టం చేశారు. ఈ ప్రసంగ సమయంలో దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు, యుద్ధం ప్రారంభంలో అమెరికా జరిపిన దాడిలో మృతి చెందిన 150 మందికి పైగా విద్యార్థుల ఫోటోలను ఆయన ప్రదర్శించారు.
మేం ఉగ్రవాదులం కాదు..
అమెరికా, ఇజ్రాయెల్‌లు తమ దేశంపై దాడి చేశాయని, ఈ దురాక్రమణల వల్ల తమ అమాయక ప్రజలు లక్ష్యంగా మారారని పెజెష్కియాన్ ఆరోపించారు. తాము కేవలం ఆత్మరక్షణ మాత్రమే చేసుకున్నామని, సాధారణ పౌరులపై ఎక్కడా దాడులు చేయలేదని చెప్పారు. తాము ఉగ్రవాదులం కాదని స్పష్టం చేశారు.
బెదిరింపులు ఒప్పుకోం..
తన ప్రసంగం ముగింపులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించారు. తాము సంప్రదింపులు, దౌత్యం, చర్చలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, కానీ బలప్రయోగం , బెదిరింపులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ట్రంప్‌తో సహా తమను బెదిరించాలని చూసే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించాలని హెచ్చరించారు.
