అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తల వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన వ్యాఖ్యలు చేయగా, ఇందుకు స్పందిస్తూ జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ సినిమా క్లిప్‌ను షేర్ చేసింది. టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాన్ని పోస్ట్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
‘ఇరాన్ రక్షణ లేని దేశం కాదు’..
ట్రంప్ తన ప్రసంగంలో ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామనే రీతిలో హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ ఎంబసీ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. ట్రంప్ ఇరాన్‌ను అంతం చేయడం గురించి మాట్లాడుతున్నారని, కానీ ఇరాన్ ఎలాంటి రక్షణ లేని బలహీన దేశం కాదని పేర్కొంది. ఇదే పోస్ట్‌లో సరదాగా స్పందిస్తూ.. ట్రంప్, ఆయన వర్గం హాలీవుడ్ సినిమాలకు బదులుగా ఇటీవల బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్లున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తెలుగు సినిమాను హిందీగా పొరబడిన ఎంబసీ..
ఇరాన్ ఎంబసీ దానిని ‘బాలీవుడ్’ సినిమాగా పేర్కొన్నప్పటికీ, అది వాస్తవానికి టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోనిది. ఆ చిత్రంలోని సుమారు 58 సెకన్ల హై-వోల్టేజ్ యాక్షన్ క్లిప్‌ను వారు జతచేశారు. అయితే ఇది హిందీ చిత్రం కాదని, తెలుగు సినిమా అని సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే గుర్తించి కామెంట్లు చేశారు. ఏదేమైనా, అమెరికా-ఇరాన్ మధ్య నడుస్తున్న తీవ్రమైన రాజకీయ మాటల యుద్ధంలో ఓ తెలుగు సినిమా సన్నివేశం ఇలా అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావనకు రావడం విశేషంగా నిలిచింది.
