అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసల వర్షం కురిపించారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 81వ వార్షిక సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేస్తూ, ఇరాన్ అణు ముప్పుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ దేశ మనుగడ కోసం ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం ఎంతో అనివార్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ట్రంప్ ప్రశంసలు ..
అరాచక శక్తులతో పోరాటంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే గొప్ప భాగస్వామి తమకు మరొకరు లేరని నెతన్యాహు కొనియాడారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ప్రమాదాన్ని ట్రంప్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారని, నాగరికతను రక్షించడానికి తామిద్దరం కలిసికట్టుగా పోరాడామని తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం తన అబద్ధాలు, అవినీతి, క్రూరత్వాల వల్లే త్వరలో కూలిపోతుందని, నిరంకుశ పాలకులపై ప్రజా శక్తి విజయం సాధించడం తథ్యమని జోస్యం చెప్పారు.
ఇతర దేశాలపై విమర్శలు..
గడిచిన మూడేళ్లుగా హమాస్, హిజ్బుల్లా, హౌతీలతో సహా ఏడు వేర్వేరు యుద్ధాల్లో ఇజ్రాయెల్ ఒంటరి పోరాటం చేసి శత్రువుల అంచనాలను తలకిందులు చేసిందని గుర్తుచేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టడానికి ఖతార్ బిలియన్ల కొద్ది నిధులు ఖర్చు చేసిందని, హమాస్ అగ్రనేతలకు ఆశ్రయం కల్పిస్తోందని విమర్శించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌ను నిరంకుశుడుగా అభివర్ణిస్తూ, ఆయన కుర్దిష్ పౌరులను పొట్టనబెట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
మమ్దానీతో వివాదం..
నెతన్యాహు ప్రసంగ సమయానికి పలు దేశాల ప్రతినిధులు నిరసనగా సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లగా, వారిని ఆయన పిరికిపందలుగా అభివర్ణించారు. న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దాని ఇజ్రాయెల్‌పై అసత్య ప్రచారం చేశారని, తన గళాన్ని అణగదొక్కాలని చూశారని నెతన్యాహు మండిపడ్డారు. మమ్దాని భార్య ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా చేసిన పోస్టులను సమర్థించారని, వీటిని ఆయన ఖండించకపోవడం గమనార్హమని విమర్శించారు. ప్రధాని ఆరోపణలను మమ్దాని ఖండించారు.
