అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల విజయాల నేపథ్యంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. అంతులేని ఇంధనాన్ని వినియోగించే ఈ కేంద్రాలకు వ్యతిరేకంగా తగిన చర్యలు తీసుకుంటామని డెమోక్రాట్లు పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) పరిశ్రమలకు, డేటా సెంటర్లకు వ్యతిరేకంగా మరింత కఠినమైన నియంత్రణలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏఐ రంగానికి డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద మద్దతుదారుడిగా ఉన్నప్పటికీ, డేటా సెంటర్లపై కఠిన నియంత్రణలు తప్పకపోవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. డిజిటల్ సమాచార నిల్వ, ప్రాసెసింగ్, పంపిణీకి ఉపయోగపడే భారీ కంప్యూటింగ్ పరికరాలు, సర్వర్లు, డేటా స్టోరేజ్ డ్రైవ్‌లు, నెట్వర్కింగ్ పరికరాలు ఉన్న పెద్ద స్థావరాలైన డేటా సెంటర్ల నిర్వహణకు భారీ ఎత్తున విద్యుత్, నీరు అవసరమవుతాయి.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తారు. టెక్సాస్, ఒహియో, జార్జియా, నెవాడా, అయోవా రాష్ట్రాల్లో గవర్నర్ పదవులకు జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ డేటా సెంటర్ల గురించి విస్తృతంగా చర్చించారు. అధిక మొత్తంలో ఇంధనాన్ని వాడుతున్న ఈ కేంద్రాలు విద్యుత్ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయనే భావన దేశవ్యాప్తంగా ప్రబలిందని, ఎన్నికల ప్రచారంలోనూ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థులు ఈ వాదనను గట్టిగా వినిపించారని తెలిపారు. టెక్సాస్‌లో స్టేట్ అగ్రికల్చర్ కమిషనర్ పదవికి పోటీ చేసిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి టక్కర్ మాట్లాడుతూ.. డేటా సెంటర్లకు వ్యతిరేకంగా తాను ప్రకటించిన వైఖరే తన విజయానికి కారణమని పేర్కొన్నారు. డేటా సెంటర్లు నీటి సరఫరాకు అటంకంగా మారాయని, తన నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రాల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు.
మరోవైపు నెదర్లాండ్స్‌లోనూ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ద హేగ్ నగరంలో మైక్రోసాఫ్ట్ సంస్థ కొత్తగా ఏర్పాటు చేయదలచిన డేటా సెంటర్ నిర్మాణానికి వ్యతిరేకంగా శుక్రవారం ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పలువురు ప్రదర్శనకారులు నిర్మాణ స్థలం వద్ద బైరాయించారు. ఇలాంటి నిరసనలు శుక్ర, శనివారాల్లో ఐరోపా వ్యాప్తంగా జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. “డేటా సెంటర్లు కృత్రిమ మేధ ఆధారిత యుద్ధాలకు, డేటా పర్యవేక్షణ, నియంత్రణలకు, మారణహోమానికి కారణమవుతాయి.. అందుకే వాటి అవసరం ఎవరికీ లేదు” అని ‘జీఫ్ తెరెంగాస్’ (పుష్ బ్యాక్) అనే ఉద్యమ బృంద నాయకుడు నాತಾನ್ టీమ్మర్ ఆందోళన వ్యక్తం చేశారు.
