మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో అద్భుతమైన వసూళ్లను సాధిస్తోంది.
బడ్జెట్ , థియేట్రికల్ బిజినెస్ వివరాలు:
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ , పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు సుమారు 42 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా, లాభాల్లోకి రావాలంటే 25 కోట్ల రూపాయల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు అంచనా వేశారు.
కేవలం ఓవర్సీస్లోనే 5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 550 స్క్రీన్లలో, రెస్టాఫ్ ఇండియా , ఓవర్సీస్లో 350 స్క్రీన్లలో విడుదల చేశారు.
ఓవర్సీస్ , అమెరికా కలెక్షన్ల సునామీ:
అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన నాటి నుంచి నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అమెరికాలో 251 లోకేషన్లలో 561 షోలకు గాను 9,085 టికెట్లు అమ్ముడై రూ. 1.23 కోట్లు (129,477 డాలర్లు) వసూలు చేసింది.
నార్త్ అమెరికాలో మొత్తం 279 కేంద్రాల్లో ప్రీమియర్లు , మొదటి రోజు కలుపుకుని రూ. 1.91 కోట్లు (200K డాలర్లు) వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కేవలం అమెరికానే కాకుండా గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లోనూ ‘ఇరుముడి’కి ఊహించని రీతిలో ఆదరణ లభిస్తోంది. తొలి రోజు ఓవర్సీస్ మార్కెట్ మొత్తంలో ఈ చిత్రానికి 600K డాలర్లు (రూ. 5.74 కోట్లు) ఓపెనింగ్స్ లభించాయి.
రవితేజ జోరు చూస్తుంటే ఆదివారం నాటికే ఓవర్సీస్లో సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియాలో వచ్చిన వసూళ్లతో కలుపుకుని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.24 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది.
