ఇరాన్-అమెరికా మధ్య దాడులు మళ్లీ ముప్పేటలా కొనసాగుతుండటంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అగ్రరాజ్య దాడులకు దీటుగా స్పందిస్తున్న టెహ్రాన్ బలగాలు, గల్ఫ్ దేశాల్లోని వివిధ అమెరికా సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది.
తీవ్రంగా దెబ్బతిన్న ఎన్ఏఎస్బీ (NASB) స్థావరం..
ఈ దాడుల్లో తమ అత్యంత కీలకమైన నేవల్ సపోర్ట్ యాక్టివిటీ బహ్రెయిన్ (NASB) స్థావరం తీవ్రంగా దెబ్బతిన్నట్లు యూఎస్ నేవీ తాత్కాలిక కార్యదర్శి హంగ్‌కావో వెల్లడించారు. పశ్చిమాసియాలో అమెరికా నౌకాదళ కార్యకలాపాలకు ఈ ఎన్ఏఎస్బీ కేంద్రమే ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా సేవలందిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ స్థావరాన్ని పలుమార్లు టార్గెట్ చేసింది. తాజా దాడుల్లో ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీనిని మళ్లీ మరమ్మతు చేయాలా లేక ఇతర ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నట్లు హంగ్‌కావో తెలిపారు. కేవలం ఎన్ఏఎస్బీ మాత్రమే కాకుండా బహ్రెయిన్‌లోని మరికొన్ని అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం.
జోర్డాన్, ఎర్ర సముద్రంలోనూ ఉద్రిక్తతలు..
ఇదిలాఉంటే, జోర్డాన్‌లోని అమెరికా స్థావరంపై కూడా ఇరాన్ దాడులకు పాల్పడటంతో పలు సైనిక విమానాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో ఒక ఎ-10 థండర్‌బోల్ట్ విమానంతో పాటు ఎనిమిది ఎఫ్-15 యుద్ధ విమానాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఇరాన్ దెబ్బలను తిప్పికొట్టేందుకు అమెరికా బలగాలు రంగంలోకి దిగి దాదాపు 30 పాట్రియాట్ క్షిపణులను మోహరించాయి. మంగళవారం జరిగిన ప్రతిఘటనలో అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన 5 యుద్ధ నౌకలను ధ్వంసం చేయగా, దానికి బదులుగా టెహ్రాన్ ఈ ప్రతిదాడులకు దిగింది. మరోవైపు టెహ్రాన్‌కు మద్దతు ఇస్తున్న హూతీ రెబెల్స్ కూడా ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో తమ దాడుల జోరును పెంచి, కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు.
