అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) నుంచి తప్పుకోవాలని నాటో సభ్య దేశాలను అమెరికా కోరినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐసీసీ వల్ల ఆయా దేశాలకు ముప్పు పొంచి ఉందని, ఇకనైనా ఆ కోర్టుకు మద్దతు నిలిపివేయాలని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ఐసీసీ సామర్థ్యాలను క్రమపద్ధతిలో రద్దు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జులైలో బ్రస్సెల్స్‌లో జరిగిన నాటోకు చెందిన 32 మంది రాయబారుల రహస్య సమావేశంలో అమెరికా ఈ డిమాండ్‌ను లేవనెత్తింది.
నాటో దేశాల స్పందన..
ఐసీసీ నుంచి వైదొలగాలని అమెరికా రాయబారి మాథ్యూ జార్జ్ నాటో దేశాలను కోరగా.. ఈ విషయంలో ఏ దేశాలు తమతో కలిసి వస్తాయో అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. అయితే, ఫ్రాన్స్ , నెదర్లాండ్స్ మాత్రం ఐసీసీకి మద్దతుగా నిలిచాయి. అమెరికా వైఖరికి తాము మద్దతు ఇవ్వబోమని ఆ దేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు, ఐసీసీ అమెరికా సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకుంటోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్రంగా ఆరోపించారు. తమను సవాలు చేసేందుకు ఐసీసీ మద్దతుదారులు అంతర్జాతీయ చట్టాలను వాడుకుంటున్నారని, తమ స్వేచ్ఛను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తే అమెరికా తీవ్రంగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.
నేపథ్యం..
జాతి నిర్మూలన, యుద్ధ నేరాలకు పాల్పడే వారిపై విచారణ జరిపేందుకు 2002లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఏర్పాటు చేశారు. నాటోకు నేరుగా సభ్యత్వం లేనప్పటికీ.. అమెరికా, తుర్కియే మినహా మిగిలిన అన్ని నాటో దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి.
