భారతదేశ వీసా విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు , క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పాత విధానాన్ని పూర్తిగా మార్చి మరింత స్పష్టమైన మార్గదర్శకాలను తీసుకువస్తోంది. పర్యాటకం, విద్య, వైద్యం లేదా వ్యాపార అవసరాల కోసం భారతదేశాన్ని సందర్శించే వారికి సరైన వీసా కేటగిరీని ఎంచుకోవడం ఇకపై మరింత సులభం కానుంది.
ప్రధాన , ఉప కేటగిరీల తగ్గింపు..
కొత్తగా రూపుదిద్దుకుంటున్న వీసా ఫ్రేమ్‌వర్క్ ద్వారా కేటగిరీల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇప్పటివరకు ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను 9కి కుదించారు. అలాగే 49గా ఉన్న వీసా ఉప కేటగిరీల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల దరఖాస్తుదారులు గందరగోళానికి గురికాకుండా తమకు తగిన కేటగిరీని సులభంగా ఎంచుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్‌లలో తగ్గిన కాలమ్స్..
వీసా దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా దరఖాస్తు ఫారమ్లలోని ఫీల్డ్స్‌ను ఏకంగా 65 నుండి 70 శాతం వరకు తగ్గించారు. దీనివల్ల దరఖాస్తుదారులు తక్కువ సమయంలో, సులభంగా వీసా దరఖాస్తును పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.
విజిటర్ , బిజినెస్ వీసా మార్పులు..
టూరిస్ట్ వీసా స్థానంలో ఇకపై విజిటర్ వీసా అమల్లోకి రానుంది. ఇందులో స్వల్పకాలిక సందర్శనల కోసం 30 రోజుల వీసా (పర్యాటకం, షార్ట్ మీటింగ్స్, వెల్నెస్, కల్చరల్ కోర్సులు), సుదీర్ఘకాలిక సందర్శనల కోసం 1, 5 లేదా 10 సంవత్సరాల వీసా , పర్వతారోహణ కోసం 6 నెలల వీసా అందుబాటులో ఉంటాయి. ఇక వ్యాపార విభాగానికి సంబంధించి లైసెన్స్-బేస్డ్ (దీర్ఘకాలిక వ్యాపారాలు, ఇండస్ట్రియల్ వెంచర్స్), కాంట్రాక్ట్-బేస్డ్ (ప్రొడక్షన్ ఇన్వెస్ట్మెంట్, కాన్ఫరెన్సులు, ఆర్ట్స్, స్పోర్ట్స్) , స్పెషలిస్ట్ లేదా బీ-2 ఈ-వీసా (ఇంజనీర్లు, టెక్నికల్ నిపుణులు) విధానాలు ఉంటాయి.
మెడికల్ , స్టూడెంట్ వీసా మార్గాలు..
వైద్యం , విద్యకు సంబంధించిన మార్గాలను మరింత స్పష్టంచేశారు. మెడికల్ వీసా విభాగంలో నాన్-ఆయుష్ (సాధారణ వైద్య చికిత్సలు) కోసం ఎం-1, ఆయుష్ చికిత్సల కోసం ఎం-3 కేటగిరీలు ఉండగా, వాటి అటెండెండ్ల కోసం ఎం-2, ఎం-4 కేటగిరీలు ఉంటాయి. స్టూడెంట్ వీసా విభాగంలో పాఠశాల నుండి పీజీ వరకు కోర్సుల కోసం ఎస్-1, రీసెర్చ్ , ఎక్స్ఛేంజ్ కార్యక్రమాల కోసం ఎస్-2 కేటగిరీలు ఉంచారు. అర్హులైన విద్యార్థులకు కోర్సు కాలపరిమితిని బట్టి లేదా గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఈ వీసా వర్తిస్తుంది.
ఇతర వీసా మార్గాలు ..
వీటితో పాటు వర్క్ (దీర్ఘకాలిక ఉద్యోగం, ఎన్జీవో, మిషనరీ), డిప్లొమాటిక్ (రాయబారులు, యూఎన్ డిప్లొమాట్లు), ఆఫీషియల్ (నాన్-డిప్లొమాటిక్ అధికారులు), జర్నలిస్ట్ (అక్రెడిటెడ్ జర్నలిస్టులు) , మిస్సెలెనియస్ (భారతీయ సంతతికి చెందిన దరఖాస్తుదారులు , ప్రత్యేక అవసరాలు) అనే మరో ఐదు కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ అప్డేట్ అవుతున్నాయి. ఈ కొత్త సవరించిన ఫ్రేమ్‌వర్క్ ద్వారా 2026 చివరి నాటికి వీసాల జారీ ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు దరఖాస్తుదారులు ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా మార్గదర్శకాలనే పాటించాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికారిక పోరల్ ను సందర్శించవచ్చు.
