వైద్య రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తున్న విప్లవాత్మక మార్పుల ద్వారా మరో పదేళ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, హార్ట్ ఎటాక్ , మానసిక సమస్యలు పూర్తిగా అంతరించిపోతాయని ఆంత్రోపిక్ సంస్థ సీఈఓ డారియో అమోడై ధీమా వ్యక్తం చేశారు. వాషింగ్టన్ కేంద్రంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కృత్రిమ మేధ జీవశాస్త్ర పరిశోధనలను, కొత్త ఔషధాల ఆవిష్కరణలను ఊహకు కూడా అందనంత వేగంగా ముందుకు తీసుకువెళ్తుందని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్న ఈ ప్రాణాంతక వ్యాధులు కేవలం గతాకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోయే రోజులు త్వరలోనే వస్తాయని అమోడై ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆల్ఫాఫోల్డ్ సంచలనం , పరిశోధనల్లో వేగం..
సాధారణ పద్ధతుల్లో ప్రోటీన్ నిర్మాణాన్ని గుర్తించడానికి నెలల కొద్దీ లేదా సంవత్సరాల సమయం పడుతుంది. అయితే అల్ఫాఫోల్డ్ వంటి కృత్రిమ మేధ ఆవిష్కరణలు కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రోటీన్ త్రిమితీయ ఆకృతులను మనముందుంచుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా జరిగే ఔషధ పరిశోధనలు కేవలం కొన్ని వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. డెమిస్ హస్సాబిస్ దీనిని ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా అభివర్ణించగా, ఎలన్ మస్క్ వంటి ప్రముఖులు సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తుందని ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఔషధ తయారీ సంస్థల భిన్న వాదనలు..
కృత్రిమ మేధ వలనే త్వరలోనే వ్యాధులన్నీ అంతమవుతాయని కొందరు ప్రముఖులు చెబుతున్నప్పటికీ, ఔషధ ఉత్పత్తి సంస్థలు మాత్రం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి. కేవలం పదేళ్ల వ్యవధిలో అన్ని రకాల రోగాలు పూర్తిగా కనుమరుగైపోతాయనడం కేవలం అతిగా ఊహించుకోవడమే అవుతుందని, ఇది కొంతవరకు అత్యాశతో కూడిన అభిప్రాయమని ఆ సంస్థలు భావిస్తున్నాయి.
