ప్రముఖ అంతర్జాతీయ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ సంచలన విషయాలను బయటపెట్టారు. చైనా గూఢచారిగా అనుమానాలు వ్యక్తమవుతున్న అలిస్ హువాంగ్ (హువాంగ్ లే) తో తనకు వివాహేతర సంబంధం ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయమై కంపెనీ సిబ్బందికి రాసిన ఇ-మెయిల్లో ఆయన తన తప్పును ఒప్పుకుంటూ కుటుంబానికి, సంస్థకు క్షమాపణలు కోరారు. ఒక నాయకుడిగా బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమైనప్పటికీ, సంస్థకు కట్టుబడి ఉంటానని, అందరి నమ్మకాన్ని మళ్లీ గెలుచుకునేందుకు అంతర్గత విచారణకు సహకరిస్తానని తెలిపారు. మరోవైపు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. జెన్సన్పై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఆయన సీఈఓగానే కొనసాగుతారని అలాగే జాతీయ భద్రతకు సంబంధించి గానీ, ఎన్విడియా రహస్యాలు గానీ ఏవీ లీక్ అవ్వలేదని స్పష్టం చేశారు.
అమెరికా దర్యాప్తు..
చైనా పౌరురాలైన అలిస్ను ఆ దేశ గూఢచారిగా అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చైనీస్ ఇన్వెస్టర్ అయిన ఆమె ప్రస్తుతం సింగపూర్‌కు చెందిన ‘మెగాస్పీడ్’ డేటా సెంటర్ కంపెనీలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. అమెరికా ఆంక్షలను ధిక్కరిస్తూ ఎన్విడియా ఏఐ చిప్‌లను మెగాస్పీడ్ ద్వారా చైనాకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో అమెరికా ప్రభుత్వం విచారణ చేపట్టింది. అయితే ఈ వార్తలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జియాకున్ స్పందిస్తూ.. తమ దేశంపై బురద జల్లేందుకే ఇటువంటి నిరాధార ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ గూఢచర్యం వార్తలను ఖండిస్తున్నామని తేల్చిచెప్పారు.
