ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల్లో త్వరలోనే తాము విజయం సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందే సైనిక దాడులు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒక ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పడిపోతాయని ట్రంప్ చెప్పారు. టెహ్రాన్‌కు అణ్వాయుధాలు అందకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలకు ముందు మళ్లీ సైనిక దాడులు జరుగుతాయా అని అడిగిన ప్రశ్నకు బదులుగా, ఆ అవకాశాన్ని తాను పూర్తిగా తోసిపుచ్చలేనని, అది సాధ్యమేనని పేర్కొన్నారు.
ఇరాన్‌పై సైనిక, ఆర్థిక ఒత్తిడి ద్వారా అమెరికా విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. సైనిక పరంగా ఇప్పటికే తాము విజయం సాధించామని, అయితే ఆ ప్రయత్నాలు ఆపేశామని దీని అర్థం కాదని అన్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని కనుమరుగైపోయిందని, ఆ దేశంలో ద్రవ్యోల్బణం దాదాపు 300 శాతానికి చేరిందని ట్రంప్ వివరించారు. ఆ దేశ సైనిక వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిందని ఆయన పేర్కొన్నారు.
