ఇరాన్ , అమెరికా దేశాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరు దేశాలు పరస్పరం హెచ్చరించుకున్నాయి. ఇరాన్తో ఒప్పందం చేసుకోకపోతే ఆ దేశాన్ని నరకానికి పంపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా, ఇరాన్ దానిని పూర్తిగా కొట్టిపారేసింది. తాము ఎవరికీ తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం ఇరాన్ మరో తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. అమెరికా లేదా ఇజ్రాయెల్ దేశాలు మరోసారి దాడికి పాల్పడితే, ఈ యుద్ధం కాస్తా హిందూ మహాసముద్రం వరకు విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు యాహ్యా రహీమ్ సఫావీ హెచ్చరించారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి నుంచి ఎర్ర సముద్రం వరకు పరిమితమైన ఈ ఘర్షణలు మరింత ముందుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఫార్స్ విడుదల చేసిన వీడియో సందేశంలో సఫావీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే హిందూ మహాసముద్రంలో ఏయే ప్రాంతాలు లేదా లక్ష్యాలను ఉద్దేశించి ఈ హెచ్చరిక చేశారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
హిందూ మహాసముద్రానికి చేరిన యుద్ధ ప్రభావం..
ఈ తాజా హెచ్చరికలకు ముందే హిందూ మహాసముద్ర ప్రాంతంలో యుద్ధ ప్రభావం పడిన ఘటన చోటుచేసుకుంది. మార్చి 4వ తేదీన శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో ఇరాన్కు చెందిన ‘ఐఆర్ఐఎస్ డెనా’ యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి టార్పెడోతో ముంచేసినట్లు నివేదికలు వచ్చాయి. భారత్లో జరిగిన నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ఈ నౌకపై దాడి జరగడంతో పెద్ద సంఖ్యలో ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
పెజెష్కియన్ కీలక వ్యాఖ్యలు..
ఇరాన్ తాజా హెచ్చరికలు వెలువడిన సమయంలోనే, అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరైన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ట్రంప్ బెదిరింపులను తిరస్కరించారు. అమెరికా ఒత్తిళ్లకు ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదని తేల్చిచెప్పారు. అదే సమయంలో, యుద్ధాన్ని ముగించేందుకు దౌత్య మార్గంలో పరిష్కారానికి తమ దేశం సిద్ధంగా ఉందని తెలిపారు. తమను ఉగ్రవాదులుగా అభివర్ణిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే తమ ప్రజలపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.
హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు..
ప్రపంచ చమురు , ద్రవీకృత సహజ వాయువు సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఇరాన్-అమెరికా ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మార్గంలో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమవుతాయి. అమెరికా తన సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే వారంలోపు హార్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడానికి సిద్ధమని ఇరాన్ అధికారి ఒకరు వెల్లడించారు.
భారత్పై పడే ప్రభావం..
యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించే అవకాశం ఉందన్న హెచ్చరికలు భారత్కు కూడా ఆందోళనకరంగా మారాయి. పశ్చిమాసియా నుంచి భారత్కు వచ్చే ఇంధన సరఫరాలు, సముద్ర వాణిజ్య మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో చమురు ధరలు, షిప్పింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సఫావీ చేసిన ఈ హెచ్చరికలు తదుపరి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.
