ఐక్యరాజ్య సమితి (ఐరాస) సర్వప్రతినిధి సభలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని ఆయన పేర్కొన్నారు. 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమయస్ఫూర్తితో జోక్యం చేసుకోవడం వల్లే వేలాది ప్రాణాలు బతికిపోయాయని కొనియాడారు. ట్రంప్ ముందుచూపు గల నాయకుడంటూ ఆయనను ప్రశంసించారు. ఇక తన ప్రసంగంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ నిలిపివేసిన సిందూ జలాల ఒప్పందం గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
ఉగ్రవాదంపై ప్రశ్న..
ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా షెహబాజ్ షరీఫ్‌కు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సమావేశం ముగించుకుని వెళ్తున్న సమయంలో ఒక భారతీయ జర్నలిస్టు ఆయనను ఉగ్రవాదంపై సూటిగా ప్రశ్నించారు. “ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ఎప్పుడు మానేస్తారు?” అని జర్నలిస్టు అడగ్గా, షెహబాజ్ సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు.
హఫీజ్ సయీద్ ప్రస్తావనపై పరారీ..
జర్నలిస్టులు వదలకపోవడంతో పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారని విలేకరులు నిలదీశారు. ఈ ప్రశ్న విన్న వెంటనే ఏమాత్రం బదులివ్వకుండా షెహబాజ్ షరీఫ్ అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
