ఇరాన్‌పై సైనిక దాడులను కొనసాగిస్తున్న అమెరికా, తాజాగా ఆ దేశ ఆర్థిక జీవనాధారాన్ని దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్‌ను ఏకాకి చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరాన్‌కు సాయం చేసే దేశాలు తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఏ దేశంపైనా ఇప్పటివరకు చేపట్టనటువంటి అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను ఇరాన్‌పై విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్‌తో ఒప్పందం కోసం అత్యుత్తమ అవకాశం ఇచ్చినప్పటికీ వారు విఫలమయ్యారని, అందుకే ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నట్లు ఆయన తన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఇరాన్‌ను ఒంటరి చేయడమే తమ లక్ష్యమని, ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. చమురు స్క్రీనింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు అన్నీ వెంటనే నిలిచిపోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదని, ఆ దేశాన్ని ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, టెహ్రాన్‌కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. ఇరాన్‌తో భారత్‌కు మిగులు వాణిజ్యం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇటీవలి కాలంలో ఈ వ్యాపార లావాదేవీలు కాస్త తగ్గినప్పటికీ.. ట్రంప్ హెచ్చరికలకు అనుగుణంగా అమెరికా కఠిన చర్యలు చేపడితే, భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.
