మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లలో ప్రేక్షకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ఈవెన్ మార్క్‌ను దాటి లాభాల బాటలోకి ప్రవేశించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందించారు.
కలెక్షన్ల జోరు , మౌత్ పబ్లిసిటీ..
ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందన లభించింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పుంజుకోవడంతో తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 37.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. పాజిటివ్ మౌత్ పబ్లిసిటీ ఈ విజయానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం వసూళ్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ‘కొరియన్ కనకరాజు’ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండటంతో కలెక్షన్ల జోరు కొనసాగుతోంది.
సెలవులు , ఫ్యామిలీ ఆడియన్స్ రెస్పాన్స్..
మరోవైపు, తెలంగాణలో సోమవారం బోనాల పండుగ సెలవు కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. సెలవు దినం కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. హారర్ కంటే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ముఖ్యంగా వరుణ్ తేజ్ – సత్య కాంబినేషన్ నవ్వులు పూయించడం కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఓవర్సీస్ మార్కెట్ , లాంగ్ రన్..
ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమా అదరగొడుతోంది. అమెరికాలో ఇప్పటికే 500 వేల డాలర్ల వసూళ్లకు చేరువైన ఈ చిత్రం, ఇదే జోరు కొనసాగితే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటే అవకాశాలున్నాయి. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చడం, వీకెండ్ కలెక్షన్లు బలంగా ఉండటంతో చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో సాలిడ్ హిట్ పడినట్లయింది.
