హిందూ మతం , సనాతన ధర్మంపై నటి అనసూయ భరద్వాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ దుమారానికి దారితీశాయి. తన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టతనిచ్చినప్పటికీ, ట్రోలింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
గతంలో ‘జై శ్రీరామ్’ నినాదం ముసుగులో జరుగుతున్న కొన్ని పరిణామాలపై అనసూయ కొన్ని కామెంట్లు చేశారు. కేవలం నినాదాలు చేయడం కంటే మనుషుల ప్రవర్తనే ముఖ్యం అని, సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడటాన్ని ఆమె ప్రశ్నించారు. అయితే తాను శ్రీరాముడిని పూజిస్తానని, ఆ భక్తితోనే తన పెద్ద కుమారుడికి హనుమంతుడి పేరు పెట్టుకున్నానని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు , నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు, హిందూ మతాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయిందంటూ ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో తన మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగానే తనను టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తూ బెదిరింపులకు దిగే కొందరిని ఉద్దేశించి మాత్రమే ఆ మాటలన్నానని, అది ఏ మతాన్ని, ఏ వర్గాన్ని లేదా ఎవరి నమ్మకాలను కించపరిచేలా అనలేదని ఆమె స్పష్టం చేశారు. సనాతన ధర్మమే తనకు ధైర్యంగా ఉండటాన్ని , తప్పును తప్పు అని చెప్పే గుణాన్ని నేర్పిందని తెలిపారు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన ఆమె, తను ఎప్పుడూ హనుమంతుడి కుమార్తెగా భావిస్తానని, అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం తన నైజం కాదని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
అయినప్పటికీ, అనసూయ వివరణ ఇచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
