అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సేవల దిగ్గజం ‘చార్లెస్ ష్వాబ్’ హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించింది. ఇందులో భాగంగా 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ‘టెక్నాలజీ కేపబిలిటీ సెంటర్ (టీసీసీ)’ను ఏర్పాటు చేసింది. 2027 చివరి నాటికి హైదరాబాద్‌లోని ఈ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్యను సుమారు 2,000కు పెంచాలని ఆ సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
భారత్‌లో ఇప్పటివరకు కాంట్రాక్టర్ల ద్వారా నిర్వహిస్తున్న పలు టెక్నాలజీ కార్యకలాపాలను రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని ఇన్‌హౌస్ ఆపరేషన్స్‌లోకి తీసుకురావాలని ఈ సంస్థ భావిస్తోంది. అమెరికాలోని ప్రధాన కార్యాలయ కార్యకలాపాలకు అవసరమైన టెక్నాలజీ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ టాలెంట్, ఆపరేషనల్ సేవలను ఈ హైదరాబాద్ కేంద్రం అందించనుంది. నగరంలో నూతనంగా ఏర్పాటైన ‘ష్వాబ్ ఇండియా’ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం ప్రారంభించారు.
గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్స్ హబ్‌గా హైదరాబాద్..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్ 10 బ్రోకరేజీ , ట్రేడింగ్ సంస్థల్లో తొమ్మిది ఇప్పటికే హైదరాబాద్‌లోనే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ముంబై భారతదేశపు ట్రేడింగ్ రాజధాని అయితే, ప్రపంచవ్యాప్తంగా ట్రేడింగ్, బ్రోకరేజీ వ్యవస్థలను నడిపించే ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వెల్త్, అసెట్ మేనేజ్మెంట్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రిస్క్ టెక్నాలజీ వరకు ఆర్థిక మార్కెట్ల చైన్‌లోని అన్ని విభాగాల్లో నగరం తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని తెలిపారు.
ష్వాబ్ ఇండియా కంట్రీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ మీనన్ మాట్లాడుతూ.. చార్లెస్ ష్వాబ్ ప్రపంచవ్యాప్త వృద్ధిలో హైదరాబాద్ కేంద్రం ఒక కీలక మైలురాయి అని, ఇక్కడి మెరుగైన మౌలిక వసతులు, టెక్నాలజీ నైపుణ్యాలు సంస్థ దీర్ఘకాలిక లక్ష్యాలకు ఎంతగానో సహకరిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్టోఫర్ వైస్, రాష్ట్ర ఐటీ శాఖ సలహాదారు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
