అమెరికాలో సోషల్ మీడియా బానిసత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటం మొదలైంది. దీన్ని ప్రస్తుతం అమెరికాలో రెండో ‘బిగ్ టొబాకో’ మూవ్‌మెంట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం మెటాకు తీవ్రమైన కష్టకాలం ప్రారంభమైంది. అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా మెటాపై ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో దావా వేశాయి.
మెటాపై ఆరోపణలు..
సోషల్ మీడియా యాప్‌లకు చిన్నారులు, టీనేజర్లు బానిసలయ్యేలా మెటా డిజైన్ చేసిందన్నదే ఈ కేసులో ప్రధాన ఆరోపణ. యూజర్లు వీలైనంత ఎక్కువ సమయం యాప్‌లలో గడిపేలా చేయడం, వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, వాస్తవాలను దాచిపెట్టడమే ఆ కంపెనీ వ్యాపార తీరు అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ మేగన్ ఓనీల్ ఆరోపించారు. తల్లిదండ్రుల అనుమతులు లేకుండా పిల్లల డేటాను సేకరించి, వారిని ఆకర్షించే వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేయడం అమెరికా చట్టాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌పై సంచలన ఉదాహరణలు..
ఇన్‌స్టాగ్రామ్‌ను ఆ కంపెనీ ఉద్యోగులు ఒక మాదకద్రవ్యంతో పోల్చిన చాట్లను ఈ సందర్భంగా చూపించారు. ఎంత చిన్న వయసులో పిల్లలు యాప్‌ను వాడటం మొదలుపెడితే.. అంత సంపాదించొచ్చని మెటా ముందస్తుగానే గుర్తించిందని మేగన్ తెలిపారు. ఈ ఆరోపణలను మెటా పూర్తిగా ఖండించింది. కేవలం అటార్నీ జనరల్స్ పరిహారాల వసూలు కోసమే ఈ దావా వేసినట్లు స్పష్టం చేసింది. ఈ విచారణ సుమారు ఆరు వారాల పాటు జరిగే అవకాశం ఉంది. న్యాయమూర్తి ఎదుటుకు జుకర్‌బర్గ్‌ను పిలిచే అవకాశం కూడా ఉందని సమాచారం.
భారీ నష్టపరిహార ముప్పు..
కాలిఫోర్నియా ఏజీ మేగన్ మాట్లాడుతూ.. ఈ కేసులో ఒకవేళ మెటా ఓడిపోతే ఏకంగా 20 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ. 19 లక్షల కోట్లు) వరకు నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చని హెచ్చరించారు.
