సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’. ఈ భారీ బడ్జెట్ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంది.
గ్రాండ్ మ్యూజికల్ ఆల్బమ్..
ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ గ్లింప్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే పాటలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. తాజాగా ‘వారణాసి’ మ్యూజికల్ ఆల్బమ్‌కు సంబంధించి కీరవాణి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఈ సినిమా ఆల్బమ్ చాలా గ్రాండ్‌గా ఉండబోతోందని, చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నాయని ఆయన స్పష్టం చేశారు.
పాటల సంఖ్యపై చర్చ..
ఇప్పటికే విడుదలైన ‘రణ కుంభ’, ‘సంచారి’ వంటి పాటలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుని చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే, కీరవాణి చెప్పిన ఆరు పాటల సంఖ్యపై ప్రస్తుతం అభిమానుల్లో చిన్నపాటి చర్చ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలను కలుపుకొని మొత్తం ఆరు పాటలు ఉంటాయా? లేదా వాటికి అదనంగా మరో ఆరు రానున్నాయా? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
రాజమౌళి విజన్‌కు కీరవాణి సంగీతం తోడైతే తెరపై ఎలాంటి అద్భుతం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ‘వారణాసి’లో ఆ మ్యాజిక్ మరింత ఎక్కువగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
