రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలనటి నక్షత్ర మీడియాతో ముచ్చటించారు.
తెరపై తన ప్రయాణం గురించి ఆమె మాట్లాడుతూ.. “ఇప్పటివరకు ఆరు సినిమాలు చేశాను. రవితేజ, శివరాజ్‌కుమార్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి అగ్ర హీరోలతో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చేసిన రీల్స్ చూసి డైరెక్టర్ శివ నిర్వాణ ఈ అవకాశం ఇచ్చారు” అని తెలిపారు.
ఈ చిత్రంలో రవితేజ కూతురు మణికంఠ పాత్రలో కనిపించనున్నట్లు నక్షత్ర చెప్పారు. రవితేజ, ప్రియ భవానీ శంకర్ ఎంతో స్నేహంగా మెలిగారని, వారి సహకారంతోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ పూర్తి చేశానని అన్నారు. తెలుగు భాష అర్థం కావడంతో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నానని వెల్లడించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే నటనను కొనసాగిస్తున్నానని, మైత్రీ సంస్థలో పనిచేయడం తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు.
