తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ప్రఖ్యాత సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వయసురీత్యా అనారోగ్యానికి గురైన ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరగా, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాసర్, నటులు సౌందరరాజన్, హేమచంద్రన్ తదితరులు ఆమెను పరామర్శించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా అప్డేట్స్ వచ్చాయి. అయితే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారని నాసర్ తన ప్రకటనలో తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని చెన్నైలోని తేనాంపేట, సీతాకోట రోడ్డులో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు ఆయన వెల్లడించారు.
షావుకారు జానకి నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కన్నడ కుటుంబంలో సంకరమంచి జానకి జన్మించారు. చిన్నతనంలోనే వివాహం జరిగినప్పటికీ, ఆకాశవాణి మద్రాస్ (ఆల్ ఇండియా రేడియో)లో రేడియో జాకీగా పనిచేశారు. గర్భవతిగా ఉన్న సమయంలోనే ఆమె మెట్రిక్యులేషన్ పరీక్షలు రాసి, ఆ తర్వాత అసోంలోని గౌహతి విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు (యజ్ఞ ప్రభ కోటి, వెంకటరమణ సంకరమంచి, శచి రావు) ఉన్నారు.
