మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ బాక్సాఫీస్ బరిలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం, కేవలం నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మించారు.
బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లు:
సాధారణంగా సినిమా ఎంత హిట్ అయినా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ తగ్గడం సహజం. అయితే ‘ఇరుముడి’ విషయంలో మాత్రం వీకెండ్ ముగిసిన తర్వాత కూడా వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. తొలి సోమవారం (వర్కింగ్ డే) నమోదైన కలెక్షన్లు సినిమా విడుదలైన మొదటి రోజు వచ్చిన వసూళ్లకు దాదాపు సమానంగా ఉండటం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటింది.
‘బాహుబలి 2’ తర్వాత ఆ రికార్డే సొంతం:
తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ రిలీజ్ సినిమాల లెక్కలను పరిశీలిస్తే, నాలుగో రోజు ఏపీ , తెలంగాణలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా ‘ఇరుముడి’ సరికొత్త రికార్డు సృష్టించింది. ‘ఇరుముడి’ కంటే ముందు కేవలం ‘బాహుబలి 2’ పేరిటే ఈ రికార్డు ఉండటం విశేషం.
రికార్డు స్థాయి టికెట్ల అమ్మకాలు:
ప్రేక్షకుల నుంచి సినిమాకు ఉన్న విపరీతమైన డిమాండ్‌కు బుక్ మై షో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్ముడైన టికెట్లే ప్రధాన నిదర్శనంగా నిలిచాయి. ఇప్పటి వరకు ఈ రెండు ఆన్లైన్ టికెట్ బుకింగ్ యాప్‌లలో ఏకంగా 38 లక్షలకు పైగా టికెట్లు సేల్ కావడం విశేషం. వీక్ డేస్‌లోనూ సినిమా చూపుతున్న బాక్సాఫీస్ జోరును బట్టి చూస్తే, ఫైనల్ రన్ అయ్యేసరికి ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్బులో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
