కార్తి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సర్దార్’ వచ్చి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ ‘సర్దార్ 2’ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ బడ్జెట్ , స్టార్ కాస్ట్ కారణంగా ప్రారంభం నుంచే అంచనాలు భారీగా పెరిగాయి. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాపై తీవ్రమైన బజ్ ఏర్పడింది.
సీక్వెల్ విశేషాలు..
మొదటి భాగంలో నీటి సమస్యను ప్రధానాంశంగా తీసుకుని దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అందులో కార్తీ ద్విపాత్రాభినయం, రెండు వేర్వేరు లుక్స్ విశేష స్పందనను రాబట్టాయి. ఇప్పుడు రాబోతున్న పార్ట్ 2 లో కూడా ఆ రెండు లుక్స్‌ను కొనసాగించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా బడ్జెట్ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తోంది. అంతేకాకుండా, కార్తీకి దీటుగా పవర్ఫుల్ విలన్ పాత్రలో ఎస్ జే సూర్య నటిస్తుండటం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
సంగీత దర్శకుడు సామ్ సీఎస్ కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి భాగంలో నీటి సమస్యను చూపించినట్లే, ఈ పార్ట్ 2 లో అంతకంటే పెద్దదైన సమస్యాత్మక అంశాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పాయింట్‌కు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉంటుందని చెప్పారు. ఈనెల 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సర్దార్ 2’ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఎంతో ధీమాతో ఉన్నారు.
