అమెరికా కేంద్ర బ్యాంకు ‘ఫెడరల్ రిజర్వ్’ (Fed) వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో అమెరికాలో కీలక వడ్డీ రేట్లు 3.75% – 4.00% శాతానికి చేరాయి. కేవలం ఈ పెంపే కాకుండా, భవిష్యత్తులోనూ ద్రవ్యోల్బణ నిరోధక చర్యలనే కొనసాగిస్తామని ఫెడ్ సంకేతాలు ఇవ్వడం ప్రపంచ ఆర్థిక మార్కెట్లతో పాటు భారతీయ స్టాక్ మార్కెట్లు, కరెన్సీ, దిగుమతి-ఎగుమతి రంగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత స్టాక్ మార్కెట్లు, రూపాయిపై ఒత్తిడి..
ఫెడ్ నిర్ణయంతో అమెరికన్ బాండ్ ఈల్డ్స్, డాలర్ సూచీలు బలపడ్డాయి. దీనివల్ల భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPI/FII) తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, సురక్షితమైన యూఎస్ ఆస్తుల వైపు మళ్లే ప్రమాదముంది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో అస్థిరత పెరిగే అవకాశం ఉంది. అలాగే డాలర్ బలపడటంతో రూపాయి మారకపు విలువ క్షీణించి, ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ దిగుమతి భారం పెరిగి ‘దిగుమతి ద్రవ్యోల్బణానికి’ దారితీస్తుంది. అయితే, డాలర్లలో ఆదాయం పొందే భారతీయ ఐటీ, ఫార్మా రంగాల ఎగుమతిదారులకు రూపాయి పతనం కొంతవరకు సానుకూలంగా మారనుంది.
రుణ వ్యయాలు భారం.. ..
యూఎస్ బాండ్ రాబడులు పెరగడంతో భారత ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ కూడా పైకి చేరి, బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీల రుణ సమీకరణ వ్యయం (Cost of Borrowing) పెరగనుంది. ఇది ముఖ్యంగా రియల్ ఎస్టేట్, పవర్, మౌలిక వసతుల రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, అంతర్జాతీయంగా బంగారం ధరలపై ఒత్తిడి ఉన్నప్పటికీ, భారత్లో రూపాయి పతనం వల్ల దిగుమతి వ్యయం పెరిగి స్థానిక మార్కెట్లో పసిడికి మద్దతు లభిస్తోంది. రూపాయి క్షీణతను కట్టడి చేయడం, ద్రవ్య లభ్యతను సమతుల్యం చేయడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి పెద్ద సవాలుగా మారనుండటంతో, ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం అధిక స్థాయిలోనే కొనసాగించే అవకాశముంది.
