అమెరికాకు చెందిన ప్రముఖ డ్రోన్ తయారీ కంపెనీ ‘పవరస్’ (PowerUs) పాకిస్తాన్ సైన్యంతో ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది. డ్రోన్ల ఆర్డర్లతో పాటు కీలకమైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరినట్లు ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బ్రెట్ వెలికోవిచ్ వెల్లడించారు. ఈ భేటీలో భాగంగా పవరస్ ప్రతినిధి బృందం పాక్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌తో సమావేశమై రక్షణ రంగ కొనుగోళ్లు, ఉత్పత్తి , దీర్ఘకాలిక సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై చర్చలు జరిపింది. ఈ ఒప్పందం అమెరికా-పాకిస్తాన్ రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అసిమ్ మునీర్ ప్రశంసించారు.
ట్రంప్ కుటుంబంతో సంబంధాలు..
ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్‌ల ప్రస్తావన తెరపైకి వచ్చింది. ట్రంప్ కుమారుల పెట్టుబడులు ఉన్న ‘ఆరియస్ గ్రీన్వే హోల్డింగ్స్’ అనే కంపెనీలో అక్టోబర్ ప్రారంభంలో పవరస్ విలీనం కానుంది. ఈ విలీనం ద్వారా ఏర్పడే కొత్త కంపెనీలో వారికి 9.9 శాతం వాటా దక్కే అవకాశం ఉంది.
అయితే, ఈ వ్యాపార విస్తరణలో ట్రంప్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, డీల్స్ అన్నీ పూర్తిగా మెరిట్ , వ్యాపార ప్రాతిపదికనే జరుగుతాయని పవరస్ సీఈఓ ఆండ్రూ ఫాక్స్ స్పష్టం చేశారు. ట్రంప్ జూనియర్ కేవలం ఒక పాసివ్ ఇన్వెస్టర్ మాత్రమేనని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ప్రైవేట్ రక్షణ రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అమెరికా సాంకేతికతతో ఇక్కడ జాయింట్ టెక్నికల్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ భావిస్తోంది.
