రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్న అమెరికా, తన విషయంలో మాత్రం వేరే రూల్స్ పాటిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, ఇరాన్, చైనా, భారత్‌లను లక్ష్యంగా చేసుకుని తెచ్చిన ‘ది లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026’ బిల్లును అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదించాయి. అయితే, ఈ కఠిన ఆంక్షల నుంచి అగ్రరాజ్యం తనకు తానుగా మినహాయింపులు ఇచ్చుకోవడం గమనార్హం.
రష్యా యురేనియంపైనే అమెరికా ఆధారపడటానికి కారణం ఏమిటి?
ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తున్న అమెరికా.. తన స్వంత అణు విద్యుత్ అవసరాల కోసం మాత్రం రష్యన్ యురేనియం దిగుమతులను కొనసాగిస్తోంది. అమెరికా పౌర అణు రంగానికి అవసరమైన యురేనియం శుద్ధి (Enrichment) సేవలలో దాదాపు 26 శాతం వరకు రష్యాపైనే ఆధారపడింది. దేశంలో ఒకే ఒక యురేనియం శుద్ధి ప్లాంట్ ఉండటం వల్ల ప్రాసెసింగ్ కొరత తీవ్రంగా ఉంది. రష్యన్ ఇంధన దిగ్గజం ‘రోసాటమ్’ (Rosatom) చౌకగా, నాణ్యమైన యురేనియం ఇస్తుండటంతో అమెరికన్ పవర్ కంపెనీలు దశాబ్దాలుగా రష్యాను నమ్ముకున్నాయి.
గ్రిడ్‌పై ప్రభావం పడకుండా ఉండేందుకే..
అమెరికాలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్‌లో దాదాపు 20 శాతం అణు విద్యుత్ ప్లాంట్ల నుంచే వస్తుంది. ఒకవేళ ఈ ఆంక్షల బిల్లులో మినహాయింపులు ఇచ్చుకోకపోతే అణు విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి, యూఎస్ పవర్ గ్రిడ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. దేశీయంగా యురేనియం శుద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికా భారీగా నిధులు వెచ్చిస్తున్నప్పటికీ, ఆ వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పట్టనుంది. అందువల్లే అగ్రరాజ్యం తన అవసరాల కోసం రష్యాపై మినహాయింపుల దారిని ఎంచుకుంది.
