ప్రస్తుతం టాలీవుడ్లో సీక్వెల్స్, ఫ్రాంచైజీలు , సినిమా యూనివర్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర కథానాయకుల భారీ చిత్రాలను ఒకే భాగంతో ముగించకుండా, కథా ప్రపంచాన్ని విస్తరిస్తూ పలు భాగాలుగా తెరకెక్కించడం మేకర్స్ మార్కెట్ వ్యూహంగా మారింది. ఇదే కోవలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ కూడా పలు భాగాలుగా కొనసాగనుంది. విశేషం ఏమిటంటే, సాధారణంగా మొదటి భాగం విడుదలైన తర్వాతే సీక్వెల్ పనులు మొదలుపెడతారు, కానీ ‘డ్రాగన్’ సినిమాకు మాత్రం ఏకకాలంలోనే రెండు భాగాల చిత్రీకరణను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.
షూటింగ్ విశేషాలు ..
తొలి భాగం విడుదలైన తక్కువ వ్యవధిలోనే రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే పక్కా వ్యూహంతో చిత్రబృందం పనిచేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు చిన్న గాయం కారణంగా కొన్ని రోజులుగా సెట్స్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన లేని సన్నివేశాలను ఇతర తారాగణంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ నిరంతరం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘లూగర్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా, బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, షాహిద్ కపూర్ కూడా ఇందులో ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విడుదల వివరాలు..
ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ హంగులు, పాన్ ఇండియా రేంజ్ స్కైల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏకకాలంలో రెండు భాగాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ‘డ్రాగన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని నాని, ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
