ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోయిన నేచురల్ స్టార్ నాని, కాలక్రమేణా తన సినిమాల శైలిని మార్చుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం, సినిమా రేంజ్, బడ్జెట్ , పాన్ ఇండియా స్థాయికి విస్తరించడంతో ఒక్కో ప్రాజెక్టుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా ఇటీవల కాలంలో ఏడాదికి ఒక సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 2023లో ‘దసరా’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో అలరించిన ఆయన, 2024లో ‘సరిపోదా శనివారం’, 2025లో ‘హిట్: ది థర్డ్ కేస్’ చిత్రాలతో పలకరించారు. ప్రస్తుతం 2026లో ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
లైనప్‌లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు..
‘ది ప్యారడైజ్’ సినిమా తర్వాత నాని చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. దీనితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే, డైరెక్టర్ వెంకీ అట్లూరితోనూ నాని ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఫ్యాన్స్‌కు పాత రోజులు గుర్తుకు వచ్చే ఛాన్స్..
ప్రస్తుతం నాని లైనప్‌లో ఉన్న ప్రాజెక్టులను చూస్తుంటే.. భవిష్యత్తులో ఆయన తన పాత వేగాన్ని మళ్లీ అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షూటింగ్‌లను వేగంగా పూర్తి చేసి సరైన ప్రణాళికతో ముందుకెళ్తే, రాబోయే సంవత్సరాల్లో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు ప్రేక్షకులను పలకరించే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూనే, మళ్లీ అదే పాత జోరును ప్రదర్శిస్తే మాత్రం నాని అభిమానులకు నూతనోత్సాహం కలగడం ఖాయం.
