టాలీవుడ్లో వరుస భారీ సినిమాలను నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers)కు ఇప్పుడు బాలీవుడ్ దిగ్గజ సంస్థ టీ సిరీస్(T Series) బలమైన ఆర్థిక భాగస్వామిగా మారింది. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య మంచి అనుబంధం కొనసాగుతుండగా, తాజాగా ఈ బాండింగ్ మరింత బలపడినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణంలో మైత్రీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు టీ సిరీస్ దీర్ఘకాలిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
సాధారణంగా భారీ సినిమాల నిర్మాణం కోసం వివిధ ఫైనాన్షియర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ ను తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అలాంటి అవసరాలను తగ్గించుకునేలా మైత్రీ సంస్థ టీ సిరీస్‌తో ప్రత్యేక ఆర్థిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నట్లు సమాచారం. మైత్రీ నిర్మించే కొన్ని సినిమాలకు టీ సిరీస్ నేరుగా పెట్టుబడులు పెడుతుండగా, మరికొన్ని ప్రాజెక్టుల్లో మ్యూజిక్ రైట్స్ ను సొంతం చేసుకుంటూ నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూరుస్తోంది. కొన్ని సినిమాల విషయంలో లాభాల్లోనూ షేర్ తీసుకునేలా డీల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో సొంత నిర్మాణాలతో పాటు ఇతర భాషల సినిమాలపై కూడా దృష్టి సారిస్తున్న టీ సిరీస్‌కు మైత్రీపై ప్రత్యేక నమ్మకం ఏర్పడినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ వెలుపల ఇంతటి స్థాయిలో దీర్ఘకాలికంగా భాగస్వామ్యం కొనసాగిస్తున్న నిర్మాణ సంస్థగా మైత్రీ నిలుస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా(Sandeep reddy vanga) తెరకెక్కించే ప్రాజెక్టుల నిర్మాణంలోనూ టీ సిరీస్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. రాబోయే రోజుల్లో మైత్రీ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులకు ఈ ఆర్థిక బంధం మరింత బలాన్ని అందించనుంది.
