ఇండియన్ సినీ ఇండస్ట్రీ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో చాటేందుకు మరో భారీ సినిమా రెడీ అవుతోంది. రణ్బీర్ కపూర్(ranbir kapoor), యష్(Yash) ప్రధాన పాత్రల్లో నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్టు రామాయణ(Ramayana) 2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల పరిశీలనకు సమర్పించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవనుందనే డిస్కషన్ మొదలైంది. అయితే అకాడమీ పరిశీలనకు సినిమా సమర్పించినంత మాత్రాన నామినేషన్ ఫిక్స్ అయినట్టు కాదు. ఆస్కార్ రూల్స్ కు అనుగుణంగా అర్హత సాధిస్తేనే వివిధ విభాగాల్లో పోటీ పడే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే భారత్ తరఫున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి మరాఠీ సినిమా గోంధల్(Gondhal) అఫీషియల్ గా ఎంపికైంది. అయినప్పటికీ ఇతర విభాగాల్లో పోటీ పడేందుకు రామాయణకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఆస్కార్ రూల్స్ ప్రకారం అమెరికాలోని ఎంపిక చేసిన ఆరు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీసం ఏడు రోజుల పాటు వరుసగా థియేట్రికల్ ప్రదర్శనలు జరగాలి. ప్రతిరోజూ కనీసం మూడు షోలు ఉండటంతో పాటు ఒక ప్రదర్శన సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య మొదలవాలి.
నితేశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి(Sai Pallavi) సీతగా, యష్ రావణుడిగా కనిపించారు. నమిత్ మల్హోత్రా(Namith Malhotra) నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ నవంబర్ 5న రిలీజై సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఆస్కార్ పరిశీలనకు సంబంధించిన వార్త నిజమైతే ఈ సినిమాకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.
