ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సినిమాల అప్డేట్ల కంటే హీరోల ఆరోగ్యానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. వరుసగా అగ్ర హీరోలు ఆసుపత్రి బాట పట్టడం, శస్త్రచికిత్సలు చేయించుకోవడం ఇండస్ట్రీలో ఆందోళన కలిగిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ చేయించుకోగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ కూడా మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ఇక ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో మణికట్టు గాయానికి గురైన రామ్ చరణ్, కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో ఆపరేషన్ విజయవంతంగా ముగించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు.
తాజాగా ఈ జాబితాలోకి ఎన్టీఆర్ కూడా చేరారు. గత కొంతకాలంగా ఎడమ భుజం నొప్పితో బాధపడుతున్న ఆయన, వైద్యుల పర్యవేక్షణలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత ఫిజియోథెరపీ పూర్తి చేసుకుని పూర్తిగా కోలుకున్నాకే ఆయన మళ్లీ షూటింగ్లలో పాల్గొననున్నారు. మరోవైపు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.
వయసు పైబడుతున్నప్పటికీ వెనకడుగు వేయకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం, యాక్షన్ సన్నివేశాల్లో డూప్‌లను ఉపయోగించకుండా స్వయంగా సాహసాలు చేయడం, పాత గాయాలు తిరగబెట్టడం వంటి కారణాల వల్లే హీరోలు తరచూ ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోంది. అయితే వీరందరూ త్వరలోనే కోలుకుని తిరిగి ఉత్సాహంగా సెట్స్‌లోకి రానుండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
