మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆసుపత్రిలో శుక్రవారం మణికట్టు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ ముగిసిందని, ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత ఫిజియోథెరపీని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్. రాజశేఖరన్ పర్యవేక్షణలో ఈ శస్త్రచికిత్స జరగగా.. గాయం తీవ్రత దృష్ట్యా అమెరికాలోని మియామికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత మణికట్టు నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా కూడా ఈ వైద్య బృందంలో భాగమయ్యారు. ‘పెద్ది’ చిత్రంలో రెజ్లింగ్ సన్నివేశాల షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయమైనప్పటికీ, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆ నొప్పితోనే షూటింగ్ పూర్తి చేశారు. అయితే పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు వైద్యుల సలహా మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రం తర్వాత విశ్రాంతిలో ఉన్న చరణ్, పూర్తిగా కోలుకున్నాక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి పట్టాలెక్కనుంది. ప్రస్తుతం చరణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
