లాస్ ఏంజిల్స్‌లోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Los Angeles) తమ పరిధిలోని భారతీయులకు సేవలను మరింత చేరువ చేసే దిశగా నెవాడాలోని లాస్ వెగాస్‌లో ప్రత్యేక ‘కాన్సులర్ క్యాంప్’ను అక్టోబర్ 17న విజయవంతంగా నిర్వహించింది. స్థానిక తెలుగు ప్రవాస సంఘం ‘వేగాస్ తెలుగు అసోసియేషన్’ (Vegas Telugu Association), ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా, ఓఎఫ్‌బీజేపీ లాస్ వెగాస్, , సౌత్ ఏషియన్ విమెన్స్ అలయన్స్ ఆఫ్ నెవాడా (SAWA) సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
100 మందికి పైగా ప్రవాసులకు నేరుగా సేవలు..
ఈ కాన్సులర్ క్యాంప్‌కు లాస్ వెగాస్ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా భారతీయ సమాజ సభ్యులు హాజరయ్యారు. పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ, వీసా సేవలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్స్, అటెస్టేషన్స్ , ఇతర పత్రాలకు సంబంధించిన సమస్యలపై కాన్సులేట్ అధికారులు ప్రతినిధులతో నేరుగా మాట్లాడి సలహాలు, సూచనలు అందించారు. అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రక్రియను అక్కడికక్కడే వేగవంతం చేశారు.

కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస అభినందనలు..
ఈ క్యాంప్ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన వేగాస్ తెలుగు అసోసియేషన్ సహా ఇతర భాగస్వామ్య సంఘాలకు కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం హరి ముడిపల్లి నిర్వహించిన ‘ఎక్స్ట్రా ఇన్నింగ్స్’ పోడ్కాస్ట్లో పాల్గొన్న కాన్సుల్ జనరల్.. లాస్ ఏంజిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన భారత కాన్సులేట్ జనరల్ ప్రాధాన్యతను, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో అది పోషించబోయే పాత్రను సుదీర్ఘంగా వివరించారు.
ప్రవాస భారతీయులకు అవసరమైన కాన్సులర్ సేవలను అత్యంత సులభంగా, పారదర్శకంగా అందించడమే కాన్సులేట్ ప్రధాన ధ్యేయమని అధికారులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
