లాస్ ఏంజిల్స్‌లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Los Angeles) ఆధ్వర్యంలో ‘ఆయుర్వేద దినోత్సవం 2026’ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. “పీపుల్ | ప్లానెట్ | ప్రివెన్షన్” (People | Planet | Prevention) అనే ప్రధాన ఇతివృత్తంతో, “ఆరోగ్యకరమైన రేపటి కోసం ప్రాచీన జ్ఞానం” (Ancient Wisdom for a Healthier Tomorrow) అనే సందేశంతో ఈ పవిత్రమైన ఈవెంట్‌ను రూపొందించారు.
వేదిక వివరాలు..
ఈ ప్రత్యేక వేడుకలు 2026 అక్టోబర్ 24, శనివారం రోజు జరగనున్నాయి. లాస్ ఏంజిల్స్ లోని విల్షైర్ బౌలెవార్డ్లో గల ఏఓఎన్ సెంటర్, సూట్ 4500 (707 Wilshire Blvd., AON Center, Suite 4500, Los Angeles, CA 90017) వద్ద ఉన్న భారత కాన్సులేట్ కార్యాలయంలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ప్రధాన కార్యక్రమాలు..
మానసిక, శారీరక సంపూర్ణ ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రపంచ సంక్షేమం దిశగా ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం అందిస్తున్న విశేష సేవలను వివరిస్తూ ఈ ఈవెంట్ సాగనుంది. కార్యక్రమంలో భాగంగా ప్రారంభంలో స్వాగత ఉపన్యాసాలు (Welcome Remarks), నిపుణులచే కీనోట్ ప్రసంగం (Keynote Address), ఆయుర్వేద జీవనశైలిపై ప్రత్యక్ష శిక్షణ లేదా ప్రదర్శన (Wellness Demonstration) , ఆయుర్వేద పద్ధతులతో తయారుచేసిన ప్రత్యేక విందు/ఆహారాలు (Ayurveda-Inspired Refreshments) అందజేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్..
ఈ కార్యక్రమాన్ని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (SCU), నేషనల్ ఆయుర్వేదిక్ మెడికల్ అసోసియేషన్ సర్టిఫికేషన్ బోర్డ్ (NAMA CB), చండికా, న్యూట్రిషన్ 360, ఆత్రేయ, జీఐఎస్‌టీ (GIST), సీఏఏఎమ్ (CAAM) వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆరోగ్య, ఆయుర్వేద సంస్థల భాగస్వామ్యంతో ఇండియన్ కాన్సులేట్ సంయుక్తంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే ఆసక్తి గల ప్రతినిధులు క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి ముందస్తుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
