నెవాడా రాష్ట్రం లాస్ వేగాస్‌లో ఉన్న భారతీయ సమాజానికి కాన్సులర్ సేవలను మరింత దగ్గర చేసే లక్ష్యంతో లాస్ ఏంజిల్స్‌లోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Los Angeles) అక్టోబర్ 17న ఒక ప్రత్యేక ‘కాన్సులర్ క్యాంప్’ను అత్యంత విజయవంతంగా నిర్వహించింది. స్థానిక ‘వేగాస్ తెలుగు అసోసియేషన్’ (Vegas Telugu Association), ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా, ఓఎఫ్‌బీజేపీ లాస్ వేగాస్, , సౌత్ ఏషియన్ విమెన్స్ అలయన్స్ ఆఫ్ నెవాడా (SAWA) సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
100 మందికి పైగా ప్రవాసులకు నేరుగా మార్గదర్శకత్వం..
ఈ క్యాంప్‌లో సుమారు 100 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్సులేట్ అధికారులు పాస్‌పోర్ట్‌ల పునరుద్ధరణ, వీసా సేవలు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్స్, అటెస్టేషన్లు , ఇతర కాన్సులర్ ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై నేరుగా మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. అంతేకాకుండా దరఖాస్తు విధానాలు, అవసరమైన పత్రాల (డాక్యుమెంటేషన్) వివరాలను క్షుణ్ణంగా వివరించారు.
కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస ప్రశంసలు..
ఈ కాన్సులర్ క్యాంప్ విజయవంతం కావడానికి సహకరించిన స్థానిక భాగస్వామ్య తెలుగు , భారతీయ సంఘాలకు కాన్సుల్ జనరల్ డాక్టర్ కె.జె. శ్రీనివాస ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హరి ముడిపల్లి నిర్వహించిన ‘ఎక్స్ట్రా ఇన్నింగ్స్’ పోడ్కాస్ట్లో కూడా మాట్లాడారు. లాస్ ఏంజిల్స్‌లో నూతనంగా ఏర్పాటైన భారత కాన్సులేట్ జనరల్ ప్రాధాన్యతను, భారత్-అమెరికా బంధాన్ని మరింత బలోపేతం చేయడంలో అది వహించే పాత్రను ఆయన సుదీర్ఘంగా వివరించారు.
తమ పరిధిలోని ప్రవాసులకు కాన్సులర్ సేవలను వేగవంతంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు దోహదపడతాయని అధికారులు స్పష్టం చేశారు.
