కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) తన ఐపీవో ద్వారా సుమారు 1.3 ట్రిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. క్లాడ్ (Claude) చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, మంగళవారం వెలువడిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం 70 నుండి 78 డాలర్ల ధరల శ్రేణిలో 82.5 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ ఐపీవో మిడ్‌పాయింట్ ధర ప్రకారం లెక్కిస్తే కంపెనీ 61 బిలియన్ డాలర్లకు పైగా నిధులను సేకరించే అవకాశం ఉంది. ఈ నెలలోనే ఈ శాన్ ఫ్రాన్సిస్కో కంపెనీ వాల్‌స్ట్రీట్‌లో అడుగుపెట్టనుంది.
రికార్డు స్థాయి నిధులు ..
చరిత్రలోనే అత్యంత భారీ ఐపీవోలలో ఒకటిగా నిలిచే అవకాశమున్న ఆంత్రోపిక్.. గత జూన్‌లో స్పేస్ఎక్స్ సేకరించిన 86 బిలియన్ డాలర్ల రికార్డును మాత్రం తాకలేకపోవచ్చు. మరోవైపు, ప్రధాన ప్రత్యర్థి అయిన ఓపెన్ఏఐ కంటే ముందే ఆంత్రోపిక్ పబ్లిక్ మార్కెట్లోకి వస్తుండటం గమనార్హం. టెక్ , ఏఐ రంగంలో ప్రకటనల వ్యాపారం లేదా రాకెట్ వ్యాపారాలతో సంబంధం లేకుండా, స్వతంత్ర పబ్లిక్ మార్కెట్ ధరను కలిగి ఉన్న మొట్టమొదటి యూఎస్ ఫ్రాంటియర్ ల్యాబ్ ఇదేనని యార్క్విల్లె ఐవెస్ అండ్ కో భాగస్వామి డాన్ ఐవెస్ పేర్కొన్నారు.
వేగంగా పెరుగుతున్న ఆదాయం ..
ఈ ఐపీవో ద్వారా ఆంత్రోపిక్ తన విస్తరణను వేగవంతం చేయడానికి భారీ వనరులను సమకూర్చుకోనుంది. అంతేకాకుండా సీఈఓ డారియో అమోడీ, సహ-స్థాపకురాలైన డానియెలా అమోడీల సంపద బిలియన్ల కొద్దీ పెరిగే అవకాశం ఉంది. గత నెల ఫైలింగ్ ప్రకారం.. ఆంత్రోపిక్ ఆదాయం మొదటి అర్ధభాగంలోనే 16 బిలియన్ డాలర్లకు పైగా చేరుకుని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14 రెట్లు వృద్ధిని సాధించింది. అయితే, పబ్లిక్ మార్కెట్లోకి వస్తున్న అనేక టెక్ కంపెనీల మాదిరిగానే ఈ సంస్థ కూడా ఇప్పటివరకు లాభాలను ఆర్జించలేదు. ఏఐ నిర్మాణానికి అయ్యే భారీ ఖర్చుల కారణంగా ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ, స్పేస్ఎక్స్ వంటి సంస్థలు పెట్టిన పెట్టుబడుల కంటే ఎక్కువ నష్టాలనే చవిచూశాయి. దీంతో ఏఐ రంగంలో బబుల్ ఏర్పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
భద్రతా హెచ్చరికలు..
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, కొత్త ద్రవ్యోల్బణ నివేదికలు రావడం వంటి కారణాలతో వాల్‌స్ట్రీట్‌లో టెక్ స్టాక్స్ ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు, ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించి భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని డార్ియో అమోడీ గతంలో హెచ్చరించారు. లేనిపక్షంలో రాబోయే 6 నుంచి 12 నెలల్లో ఇంటర్నెట్ను నియంత్రించే ఏజెంట్లు తయారయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ షేర్లు త్వరలో నాస్డాక్ గ్లోబల్ సెలెక్ట్ మార్కెట్లో ‘ANT’ టిక్కర్ సింబల్ తో లిస్ట్ కానున్నాయి.
